విరాధుడు
సీతారామలక్ష్మణులు అరణ్య వాసం చేస్తుండగా వారు అనేక ఋషి ఆశ్రమాలను దర్శించారు. అలాగే ఒక ఆశ్రమాన్ని దర్శిస్తున్న సమయం లో ఆ ఆశ్రమం లోని ఋషులు ఆ చుట్టుప్రక్కల ఉన్న రాక్షసుల వాల్ల తమకు ఇబ్బంది కలుగుతోoది అని చెప్పి, రామ చంద్రుడే వారిని ఈ భాధనుండి తప్పించాలని కోరారు. రాముడు అంగీకరించి, వారు ఇచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించి సీతాలక్ష్మణ సమేతుడై బయలుదేరారు.
అలా కొంతదూరం వెళ్ళాక, ఒక చోట చీకూరువాయువులు పులిసిపోయిన రక్తాన్ని తినే ఈగలు కనపడ్డాయి. దానిని బట్టి అక్కడికి దగ్గరలోనే ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోతయిన కళ్ళతో, భయంకరమైన పెద్ద కడుపుతో, పర్వతమంత ఆకారంతో, పెద్ద చేతులతో, అప్పుడే చంపిన పెద్ద పులి తొలు నెత్తురోడుతుండగా తన వంటికి చుట్టుకుని,ఓ శూలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్లు, 10 జింకలతో పాటు ఒక ఏనుగు గుచ్చుకుని, వొంటి నిండా మాంసం అంటుకున్న ఒక రాక్షసుడు వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి, అమాంతం సీతమ్మని తన వోళ్ళో కూర్చోబెట్టుకుని, రామ లక్ష్మణులతో ఇలా అన్నాడు.
"మీరు అధర్ములు, పాపమైన జీవితం కలవాళ్ళు. ముని వేషాలు వేసుకుని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు. అందుకే మీ భార్యని నేను తీసుకున్నాను. ఇకనుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది. అందుకని మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపొండి. నన్ను విరాధుడు అంటారు. నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషుల మాంసం తినటం చాలా ఇష్ట మైన పని" అన్నాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడితో " చూసావా లక్ష్మణా ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోతుందో! నాకు ఎంత కష్టం వచ్చిందో చూసావా. నా కళ్ళ ముందే పరాయివాడు నా భార్యని ఎత్తుకుని తీసుకెళ్ళి, తన వొళ్లో కూర్చోపెట్టుకున్నాడు. నాకు చాలా భాదగా ఉంది" అని. ఆ విరాధుడి వైపు చూసి "మమ్మల్ని ఎవరు అని అడిగావు కదా. మేము దశరధ మహారాజు పుత్రులము. మేము రామ లక్ష్మణులం. మా తండ్రిగారి మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాము. అసలు నువ్వు ఎవరు?" అని రాముడు అడిగాడు.
అప్పుడా విరాధుడు " నేను జావుడు అనే ఆయన కుమారుడను.మా అమ్మ పేరు శతహ్రద. నేను అరణ్యాలలో తిరుగుతూ అన్ని తింటూ ఉంటాను" అని చెప్పి, సీతమ్మని తీసుకుపోయే ప్రయత్నంలో ఉండగా, రామ లక్ష్మణులు అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగించారు. అప్పుడా విరాధుడు కేవలం ఆవులించేసరికి, ఆ బాణములు కింద పడిపోయాయి. అప్పుడు వాళ్ళు అనేక బాణములతో ఆ విరాధుడిని బాధపెట్టారు. ఆగ్రహించిన వీరాదుడు రాముడి మీదకి తన శూలo తో దాడి చేసాడు. అప్పుడు రాముడు తన బాణముల చేత ఆ శూలాన్ని గాలిలో ముక్కలు చేశాడు.
అప్పుడా విరాధుడు సీతమ్మని విడిచిపెట్టి, రామ లక్ష్మణుల ఇద్దరిని పట్టుకుని, తన భుజం మీద వేసుకుని అరణ్యం లోకి పరుగెత్తాడు. ఆది చూసిన సీతమ్మ కు ఏమి చెయ్యాలో తెలియక గట్టిగా ఆక్రందన చేసింది. అప్పుడు రాముడు తన బలం చేత ఆ విరాధుడి యొక్క చేతిని విరిచేసాడు. లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు క్రిందపడ్డాడు. క్రిందపడ్డ వీరాదుడిని రామ లక్ష్మణులు తీవ్రంగా కొట్టారు. పైకి కిందకి పడేశారు. అయినా వాడు చావలేదు. ఇలా లాభం లేదు, ఇక వీడిని పాతిపెట్టాల్సిందే అని, రాముడు లక్ష్మ ణుడితో, ఏనుగుని పట్టటానికి తవ్వే లాంటి ఒక పెద్ద గొయ్యి తవ్వమని, ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకి అరణ్యం అంతా కదిలిపోయింది. కొంతసేపాటికి లక్ష్మణుడు గోతిని తవ్వేశాడు.
అప్పుడా విరాధుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. ఓ రఘునందనా! నేను తపస్సు చేసి బ్రహ్మ గారి వరం పొందాను కనుక నన్ను ఏ అస్త్ర శస్త్రములు ఏమీ చెయ్యలేవు. నేను ఒకప్పుడు తుంబురుడు అనే పేరు కలిగిన గాంధర్వుడిని. నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామం వలన కుబేరుడి సభకి వెళ్లలేదు. ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శాపించాడు. అప్పుడు నేను కుబేరుడిని నాకు శాపవిమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాను. నీవు ఏనాడు దశరధుడి కుమారుడైన రాముడి చేతిలో నిహతుడవు అవుతావో ఆనాడు నువ్వు శాపవిముక్తుడవై మళ్లీ స్వర్గాన్ని పొందుతావు అని కుబేరుడు చెప్పాడు. కాబట్టి, నన్ను ఈ గోతిలో పూడ్చేసి సంహరించండి అని అడిగాడు. తరువాత రామ లక్ష్మణులు ఆ విరాధూడిని ఆ గోతిలో వేసి, మట్టితో పూడ్చేసి, శరభంగ ముని ఆశ్రమమానికి వెళ్లారు.
ఈ విరాదునికి కర్కటి అనే భార్య ఉంది. విరాధుడు చనిపోయిన తర్వాత ఆమెను కుంభకర్ణుడు బలాత్కారం చేయగా ఆమెకు ఒక పుత్రుడు కలిగాడు అతనిని భీమ అని ఆమె పిలిచింది. ఆ భీముని వల్లనే భీమశంకర జ్యోతిర్లింగం వచ్చినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి