16, మార్చి 2015, సోమవారం

ఉత్తరమునకు తల ఉంచి ఎందుకు పడుకో కూడదు?

ఉత్తరమునకు తల ఉంచి పడుకుంటే ఇక ఏమయినా ఉందా! అలా పడుకుంటే దయ్యములు వచ్చి మనల్ని పట్టేసుకుంటాయి, మనల్ని పీల్చి పిప్పి చేస్తాయి. లేదంటే తిన్నగా చావే వస్తుంది అని కొందరు, అబ్బే అవి అన్నీ మూఢనమ్మకములు అని కొందరు, అనేకమయిన సమాధానములు వినిపిస్తాయి కదా! మరి నిజం ఏంటి?
భూమికి కూడా అయస్కాంత శక్తి ఉన్నది(గురుత్వాకర్షణ దీనికి రుజువు).
మనం చిన్నప్పుడు అయస్కాంత తత్త్వం గురించి చదువుకున్నాం కదా! ఒక అయస్కాంతాన్ని వ్రేలాడదీస్తే అది ఉత్తర దక్షిణ ద్రువముల వైపుగా విశ్రాంతి స్థానమునకు చేరుతుంది. అంటే భూమి యొక్క  అయస్కాంత క్షేత్రం ఉత్తర దక్షిణ దృవములకు ఉంటుంది.
మనకు ఈరోజు ఉన్న అధునాతనమయిన విజ్ఞాన శాస్త్రము ప్రకారం మానవుని దేహం కూడా తనదయిన ఒక అయస్కాంత పరిధిని కలిగి ఉంటుంది. దీనికి కారణం నిరంతరం మన దేహంలో నిర్విరామం గా ప్రవహిస్తూ ఉండే రక్తం అని చెప్తారు. కనుక మనం ఉత్తరం వైపునకు తల పెట్టి పడుకున్నట్లయితే మన శరీరంలోని అయస్కాంత పరిధి భూమి యొక్క అయస్కాంత పరిధితో  సమాంతరంగా ఉంటుంది. అలా ఉండటం వలన మన దేహంలో నిరంతరం ప్రవహించే రక్తం వలన కలిగే రక్తపీడనంలో మార్పులు సంభవిస్తాయి. దాని కారణంగా రక్తమును నిరంతరం మన శరీరంలో పంపు చేసే గుండె ఆ మార్పులను తట్టుకోవటానికి మరింత బలంగా పనిచేయవలసి వస్తుంది.
మరో విషయం ఏంటంటే మన రక్తంలో కొంత ఐరన్ ఉంటుంది. భూమికి ఉన్న అయస్కాంత శక్తి కారణంగా మన దేహంలోని ఇనుము కూడా రక్త ప్రసరణ కార్యక్రమంలో అవరోధంగా ఉంటుంది. దీనివలన తలనొప్పులు, ఆల్జిమర్, పార్కిన్సన్ వ్యాధులతో పాటు మెదడుకు సంబంధించిన రుగ్మతలు కూడా కలిగే అవకాశం ఉంటుంది.
అబ్బో అన్నీ ఇలానే చెప్తారు! మేం ఎప్పటి నుండో ఇలానే పడుకునే అలవాటు ఉంది మాకు ఏమీ తేడా లేదు. అని ఎవరైనా అనుకోవచ్చు. ఇలా ఒకరోజు పడుకుంటేనే ఇవన్నీ  జరుగుతాయని కాదు. ఇలా పడుకోవటం ఒక అలవాటుగా మారితే మన ఆరోగ్యంలో అనేకమయిన మార్పులు వస్తాయి అనే మనకు అటువైపు తల పెట్టి పడుకోవద్దు అని చెప్తారు. 

13, మార్చి 2015, శుక్రవారం

నేను చదివిన ఒక మంచి టపా

జ్యోతిష శాస్త్రమా? విజ్ఞాన శాస్త్రమా? అని రాజసులోచనం గారు రాసిన టపా చాలా బాగుంది.
ఒకరు మూఢనమ్మకం అంటారు. ఒకరు శాస్త్రం అంటారు. ఒక నిజమును  దాచి అది అబద్దం అబద్దం  అని వంద సార్లు ప్రచారం చేసినంత మాత్రాన అది అబద్దం అయిపోదు కదా! మన విజ్ఞానం, మన జ్ఞానం పూర్వికుల నుండి మనకు ప్రాప్తించిన అత్యంత అమూల్యమైన నిధి. అది నిధి అని కొందరు చెబుతున్నా దానిని నమ్మకుండా వితండవాదములు, పిడి వాదములు చేసే పిచివాళ్ళు ఎక్కువ కదా! వారిని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు కనుక నిజమును  నిరూపించుకోవటానికి (సాద్వి మా తల్లి సీతకే తప్పలేదు కదా!) కొన్ని పరిక్షలకు పూనుకోవలసినదే.
ఈ సృష్టిలో మనం మనకు తెలిసిన, మనం అర్ధం చేసుకున్నది ఎంత మాత్రమో ముందు మనకు తెలిస్తే, అప్పుడు ఏది సాస్త్రమో ఏది శాస్త్రం కాదో తెలుస్తుంది. "కోడి ముందా? గుడ్డు ముందా?" అనే ప్రశ్నలను ముందు పెట్టుకుని దాని మీద గంటలు గంటలు కార్యక్రమములు నిర్వహించి చివరకు మనకెందుకు అని నిట్టూర్చే అలవాటు ఉన్న సామాజిక భాద్యతగల అనేక చానళ్ళు దీని గురించి అంతగా పట్టించుకోవు. కానీ ఈ రోజు మొదలయిన ఈ పరిశోధన మన మున్డుతరముల వారికి తప్పకుండ మార్గదర్శకం అవుతుందని ఆశిస్తున్నాము.

దీపిక 

9, మార్చి 2015, సోమవారం

విశ్వామిత్రుడు - ఆకలి

మనిషి భరించే అనేకమైన కష్టములలో ఆకలి అనేది అత్యంత భయంకరమైనది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న అష్ట కష్టములలో యాచన అనేది ఆకలి తీర్చుకోవటం కోసమే కదా! అటువంటి ఆకలి మనిషిని ఎంత పని అయినా చేయిస్తుంది. మరి ఆ ఆకలి ఒక తపోధనుడయిన విశ్వామిత్ర మహర్షిచేత ఎటువంటి పని చేయించినదో  తెలుసుకుందామా?
ఇంతకూ ముందు సత్యవ్రతుని కారణంగా రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చినది అని తెలుసుకున్నాం కదా! ఈ సంఘటన ఆ సమయంలోనే జరిగినది. ఈ కరువు ప్రారంభం కాక మునుపే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదవిని కోరి తపస్సు చేయటం కోసం తన భార్య బిడ్డలను వదలి, అరణ్యములకు వెళ్ళాడు.
కొంతకాలం తీవ్రమైన తపస్సు చేసాడు. అప్పటికి ఆ రాజ్యంలో కరువు వచ్చి 12 సంవత్సరముల కాలం అయింది. ఇంకా వర్షం పడలేదు. ఎక్కడా  పచ్చదనం అనేది లేదు. కాయలు కాసే చెట్లు  కాదుకదా, ఒక మొక్క కూడా లేవు. ఆ సమయంలో విశ్వామిత్రునికి తీవ్రమైన ఆకలి భాద మొదలయ్యింది. దానిని తీర్చుకొనుటకు అనేక మార్గములా ప్రయత్నించాడు. ఎక్కడా  ఒక్క ఫలం కూడా దొరక లేదు.
చివరకు ఆ అడవిలో ఒక ఇల్లు కనిపించినది. తీవ్రమైన ఆకలి భాద తట్టుకోలేక ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని నిద్రపోతున్నాడు. ఆకలి భాదను తట్టుకోలేని విశ్వామిత్రుడు నిద్రపోతున్న యజమానిని చూసి, అతనిని నిద్రలేపే ప్రయత్నం చేయకుండా, ఉట్టిపై ఉన్న కుండను క్రిందకు దించాడు. ఆ కుండలో వండిన కుక్క మాంసం ఉన్నది. మూత తీసిన మరుక్షణం అది కుక్క మాంసం అని  విశ్వామిత్రునికి తెలిసింది. కానీ తట్టుకోలేని ఆకలి కారణంగా, కుక్క మాంసం తినకూడదు అని తెలిసి కూడా తినటానికి నిర్ణయించుకున్నాడు.
సరిగా అప్పుడే ఆ ఇంటి యజమాని నిద్రలేచాడు. తన ఇంటికి ఒక దొంగగా వచ్చి, తన కుండను క్రిందికి దింపిన విశ్వామిత్రుడిని అనేక రకములయిన ప్రశ్నలు వేసాడు. ఆకలి మనిషిని ఇంతగా లొంగదీసుకుంటుంది అనే విషయం అర్ధమయిన విశ్వామిత్రుడు అతనికి నిజమును చెప్పాడు. ఆకలి కారణంగా పోతున్న ప్రాణమును నిలబెట్టుకోవటం ముఖ్యం కనుక ఆటవికుని ఇంటిలో పరమ దూష్యమయిన కుక్క మాంసం కూడా తినటానికి సిద్దమయిన విషయం చెప్పి, ఒకవేళ ఒక మునిగా తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడు కుక్క మాంసం తినటం వలన అతనికి పాపం వచ్చినట్లయితే, ఆ పాపం తనకు కాక, ఈ రాజ్యం మొత్తం ఆకలికి అల్లాడేలా చేసిన ఆ వరుణ దేవునికి వస్తుంది అని చెప్పాడు.
ఆ మాటలు అలా విశ్వామిత్రుని నోటినుండి వచ్చాయోలేదో అప్పుడే విపరీతమైన కుంభవృష్టి ప్రారంభం అయినది. అంటే రాజ్యమును ఆకలికి గురిచేసిన పాపం నుండి వరుణుడు తప్పుకున్నట్లు. 

2, మార్చి 2015, సోమవారం

సత్యవ్రతుడు

సూర్య వంశం లో  జన్మించిన అనేక రాజులలో ఒకరు అరుణుడు.  అరుణుని పుత్రుడే సత్యవ్రతుడు. కాలాంతరంలో ఈ సత్యవ్రతుడే త్రిశంకు అనే నామాంతరం పొందాడు. ఇతని కారణంగా తండ్రి అయిన అరుణుని రాజ్యంలో 12 సంవత్సరముల  వర్షము కురవక, ప్రజలు అనేక కష్టములను అనుభవించారు.  దానికి కారణం?
సత్యవ్రతుడు సూర్య వంశ రాజకుమారుడు. చిన్న తనం నుండి లభించిన గారాబంతో పాపాత్ముడుగా ప్రవర్తించ సాగాడు. కామమునకు కూడా వశుడయ్యి జీవించసాగాడు. ఒకనాడు వివాహం జరగ బోవుచున్న ఒక బ్రాహ్మణ కన్యను పెళ్లి పీతల మీద నుండి అపహరించి తీసుకుని వెళ్ళాడు. ఈ విషయం బ్రాహ్మణులూ అంటా కలిసి తమ రాజయిన అరుణునికి తెలియచేసారు. ఇన్ని రోజులు కొడుకు చేస్తున్న తప్పులు తెలిసీ తెలియనట్లు ఊరుకున్న అరుణుడు సత్యవ్రతుడ్ని తీవ్రంగా శిక్షించ తలచాడు. కొడుకుకి దేశ బహిష్కారం విధించాడు. అడవులలోకి వెళ్లి నాగరికత తెలియని ఆటవిక జనంతో కలిసి బ్రతకమని వెలివేసాడు.
తండ్రి మీద కోపంతో రాజమును వదిలి వెళ్ళే సమయంలో తమ కుల గురువు గారయిన వశిష్టుడు చెపితే తన తండ్రి ఏమయినా తన శిక్షను తగ్గించే అవకాసం ఉండొచ్చు అని, వెంటనే గ్ఫురువు గారి వద్దకు వెళ్ళాడు. అప్పుడు సత్యవ్రతుడిని చూసిన వశిష్టుడు అప్రియంగా మొహం పెట్టి, సత్యవ్రతుడు చేసిన అన్యాయానికి అరుణుడు సరి అయిన శిక్షనే విధించి మంచి పని చేసాడు అని సత్యవ్రతుని దేశ బహిష్కారమును సమర్ధించాడు.
అప్పుడు సత్యవ్రతుడు అడవులలో ధనుర్భాణములు ధరించి వేట ద్వారా తన కడుపు నింపుకుంటూ బ్రతక సాగాడు.
కుమారుడు చేసిన పనికి కుమిలిపొతూ అరుణుడు రాజ్యమును వదలి తపస్సుకోసం వెళ్ళాడు. అప్పుడు  12 సంవత్సరముల  పాటు తీవ్రమయిన కరువు, అనావృష్టి సంభవించాయి.

నా ఆలోచన:
ఇక్కడ సూర్యవంశం లో ఒక రాజు అతని కుమారుని గురించి చెప్పారు. మనం ఇక్కడ గుర్తించ వలసిన విషయములు
  1.  ఒక రాజ కుమారుడు తప్పు చేస్తే భాదితులు ఆ రాకుమారుని తండ్రికే పిర్యాదు చేసారు. అంటే ఆ కాలంలో ప్రజలు రాజుతమకు న్యాయం చేస్తారు అని నమ్మారు. 
  2. రాజుగారు తప్పు చేసినది తన కొడుకు కనుక పక్షపాత దృష్టితో తప్పుకు తగిన శిక్ష విధించకుండా ఉండలేదు. తప్పు తన వారు చేసినా కూడా న్యాయం చేయటం తమ కర్తవ్యంగా భావించే వారు అని మనకు అర్ధం అవుతుంది. 
  3. గురువు తనకు వత్తాసు పలుకుతాడేమో అని ఆశ పడిన శిక్షార్హుని గురించి గురువు ఎంత మాత్రం జాలి చూపించలేదు సరి కదా తగిన న్యాయం జరిగినది అని రాజును ప్రసంశించాడు. ఆ రోజులలో గురువులు సత్యం తరపున నిలబడే వారు అని తెలుస్తుంది. 
  4.  రాజు కొడుకు రాజ్యం వదలి వెళ్ళిన తరువాత తను కూడా ఉండలేక  తపస్సు సాగాడు. అంటే రాజ్యమును వదిలి వేశాడు. అతని కర్త్యవం నిర్వర్తిన్చాకునాడ కొడుకు పై ప్రేమతో రాజమును అనాధలా వదలి వెళ్లి పోయాడు. కనుక రాజ్యం లో అరాచకం నెలకొన్నది కనుక ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించి ఉంటారు, కనుక అధర్మం తాండవం చేసి ఉండాలి. కనుకనే ఆ రాజ్యం కరువుతో భాద పడవలై వచ్చి ఉండాలి. సరి అయిన రాజు (నాయకుడు) లేక పొతే ప్రజలు ఎన్ని కష్టములు పడవలసి వస్తుందో మనకు తెలుసు కదా!!