16, నవంబర్ 2014, ఆదివారం

భృగువు - ఖ్యాతి

భృగువు నవ బ్రహ్మలలో ఒకడు ఇతని భార్య ఖ్యాతి, దేవహుతి, కర్దమ ప్రజాపతిల పుత్రిక. వీరికి ఒక కుమార్తె  ఉన్నది. ఆమే భార్గవి.  ఇద్దరు పుత్రులు కూడా ఉన్నారు. వారు
  1. దాత 
  2. విధాత 
పుత్రులు ఇద్దరూ మేరు పర్వత పుత్రికలను వివాహం చేసుకున్నారు. 
  1. దాత భార్య యాయతి: వీరి పుత్రుడు మృకండుడు, మృకండుని పుత్రుడే మార్కండేయుడు 
  2. విధాత భార్య నియతి: వీరి పుత్రుడు మహర్షి వేదశిరుడు
భృగు మహర్షి కి ఉశన అనే మరో భార్య యందు ఉశనసుడు (శుక్రుడు) జన్మించాడు.  

4, నవంబర్ 2014, మంగళవారం

మలేషియా నన్ను ఏడిపించింది!

నేను ఇలా చెప్పటం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. మలేషియా నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలను ఇచ్చినది. కానీ చివరిగా అది మిగిల్చిన విషాదం? ఇందులో మలేషియా ఏమి చేసింది పాపం!!
ఏమిలేదు. మా పాప తొలి అడుగులు నేర్చింది, తొలిపలుకులు పలికినది మలేషియాలోనే. మరి ఆ మంచి జ్ఞాపకములకు మలేషియాని మెచ్చుకున్నపుడు ఇప్పుడు నాకు జరిగిన నష్టం కూడా మలేషియానే భాద్యత తీసుకోవాలి కదా!
మా అందరి జీవితములకు ఆధారమైన మా తండ్రిగారు, మమ్ములను వదలి, వారి ప్రయాణం వారి స్వంత మార్గంలో కొనసాగిస్తూ వెళ్ళిపోయారు. ఈ విషయం నేను మలేషియాలో ఉండగానే తెలిసినది. అత్యంత శోకంతో అక్కడి నుండి బయలుదేరిన నాకు, మలేషియా కన్నీటితో వీడ్కోలు చెప్పింది. తన సంతాపం తెలియ చేసింది. కానీ మా తండ్రి గారి పార్ధివ దేహం మాకోసం దాదాపుగా 34 గంటలు వేచి ఉన్నది. నాకు నచ్చలేదు.
నేను మలేషియా లో ఉండటం వల్లనే కదా మా తండ్రిగారికి ఈ అవస్థ. అందుకే నాకు మలేషియా నచ్చలేదు. నాకు వేడ్కోలు చెప్తూ తను ఏడుస్తూ నన్ను కూడా ఏడిపించింది.

మరొక టపా ఎప్పటికి రాయగలనో తెలియదు. కనుక మా ఈ మౌనాన్ని అన్యధా భావించకండి.

అశ్రు నయనములతో
దీపిక